తాండూరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా
May 12, 2026
Prajagalam News
(తాండూర్)
వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐపీఎస్ తాండూరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని పలు కీలక రికార్డులను, క్రైమ్ రిజిస్టర్లను మరియు పెండింగ్ కేసుల స్థితిగతులను ఆమె నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, ముఖ్యంగా పట్టణంలో దొంగతనాల కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, నిందితులను త్వరగా పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు.రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని తాండూర్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ స్పష్టం చేశారు. స్థానిక మత పెద్దలు, ప్రముఖులతో తక్షణమే పీస్ కమిటీ (శాంతి కమిటీ) సమావేశాలను ఏర్పాటు చేసి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కమ్యూనల్ అంశాలకు సంబంధించి పాత నేరస్తులు, రౌడీ షీటర్లు మరియు అనుమానితులపై నిరంతరం నిఘా ఉంచాలని, అవసరమైతే వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.కేసుల దర్యాప్తులో జాప్యం జరగకుండా పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని, రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం ద్వారా ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించాలని ఎస్పీ పేర్కొన్నారు.ఈ తనిఖీ కార్యక్రమంలో తాండూర్ ఇన్స్పెక్టర్ పరమేశ్వర్ , స్థానిక పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.