రాష్ట్రంలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు విమర్శించారు.
సోమవారం రైతు గోస-బిజేపి భరోసా యాత్ర ప్రారంభంలో భాగంగా వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బిజేపి జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాద్ రావు ఆధ్వర్యంలో సందర్శించి కొనుగోలు కేంద్రంలోని పరిస్థితులను, రైతుల ఇబ్బందులను పరిశీలించిన అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు ప్రతి కొనుగోలు కేంద్రంలోనూ ధాన్యం కుప్పలు పేరుకుపోయాయని,రైతులు గత 10-15 రోజులుగా లారీలు ఎప్పుడు వస్తాయో, తమ ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారోనని కళ్లల్లో ఒత్తులు వేసుకుని వేచిచూస్తున్నారు. కేంద్రాల్లో టార్పాలిన్లు, గోనెసంచులు లేక, లారీలు రాక, తూకాలు సకాలంలో కాక రైతాంగం తీవ్ర అల్లాడిపోతోంది. మొదట బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భువనగిరి జిల్లాలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించి పరిస్థితులను తెలుసుకుని రైతులకు భరోసా కల్పించడం జరిగింది. అదే ఉద్దేశంతో ఇవాళ 'రైతు గోస - బీజేపీ భరోసా' యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో, శిశుమందిర్ లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీనియర్ నాయకుల బృందమంతా సందర్శించామని తెలిపారు.
అయితే బీజేపీ బృందం పర్యటిస్తుందనే సమాచారంతో నిన్న రాత్రికి రాత్రే ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడి రైతులను బెదిరించి, సంచులను నింపి, ఎట్లా పడితే అట్లా మిల్లర్ల వద్దకు తరలించింది. ఇంకా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరపకుండానే, అధికారులు ధాన్యం కొనుగోలు చేసేశామంటూ అబద్ధాలు చెప్పడం దారుణం. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకే ట్రాక్టర్లలో గోనె సంచులు తీసుకొచ్చి రైతుల ధాన్యాన్ని నింపి మిల్లర్లకు తరలించామని రైతులే స్వయంగా మాకు చెబుతున్నారు. కేవలం బీజేపీ నాయకుల బృందం వస్తోందనే భయంతోనే.. ప్రభుత్వ యంత్రాంగం కళ్లుగప్పేలా కొనుగోలు ప్రక్రియ జరుగుతున్నట్లుగా ఇక్కడ డ్రామాలు ఆడుతోందన్నారు.
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలి. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా, తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం ధాన్యానికి మౌలిక వసతులు కల్పించి, వేగంగా కొనుగోళ్లు జరపాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు.
ఈ రైతుభరోసా యాత్రలో బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, శాసన మండలిపక్ష నేత ఏవిఎన్ రెడ్డి, ఎంపీలు శ్రీమతి డీకే అరుణ,ఈటల రాజేందర్, మాధవనేని రఘునందన్ రావు,కొండా విశ్వేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి,పైడి రాకేశ్ రెడ్డి,డా. పాల్వయి హరీశ్ బాబు,ధన్ పాల్ సూర్యా నారయణ గుప్త,రామారావు పటేల్,ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య,సి. అంజి రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీ నర్సయ్య, బీజేపీ వికారాబాద్ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాద రావు,బిజేపి జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.