schedule Saturday, May 30, 2026

కేరెల్లి లో ఉగాది సంబురాలు

calendar_today March 19, 2026
person Prajagalam News
-కేరెల్లి గ్రామంలో ఉగాది సంబరాలు! -కులమత భేదాలు లేకుండా ఉగాది పండగ! వికారాబాద్-: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఉగాది సంబరాలు కొనసాగాయి. ధరూర్ మండల్ కేరెల్లి గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకుని గ్రామస్థులు ఆనందోత్సాహాలతో వేడుకలను నిర్వహించారు. కులమత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పండుగను జరుపుకోవడం గ్రామ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా యువకులు నిర్వహించిన " తగాఫర్ థర్డ్ గేమ్, పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తం 8 జట్లు పాల్గొన్న ఈ క్రీడల్లో ప్రతి జట్టులో 10 మంది సభ్యులు ఉండగా, సుమారు 80 మంది యువకులు తమ ప్రతిభను ప్రదర్శించారు. గ్రామ పెద్దలు యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ పోటీలు ఉత్సాహంగా జరిగాయి.ఆటలు ప్రారంభం నుంచే ఉత్కంఠభరితంగా సాగి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రతి జట్టు గెలుపు కోసం పట్టుదలగా పోరాడగా, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఆటగాళ్లను ప్రోత్సహించారు. పోటీల్లో విజేతగా నిలిచిన బేగారి శ్రీనివాస్ జట్టుకు రూ. 5000 నగదు బహుమతి, ద్వితీయ స్థానంలో నిలిచిన బల్వంత్ రెడ్డి జట్టుకు రూ. 2500 బహుమతి అందజేశారు. మొదటి బహుమతిని ధరూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి అందించగా, రెండో బహుమతిని గ్రామ సర్పంచ్ అంపల్లి పద్మ రాములు అందజేశారు. విజేత రన్నరప్ జట్లు తమ బహుమతి మొత్తాన్ని కేరెల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల అవసరాల కోసం వినియోగించాలని నిర్ణయించి, ఆ మొత్తాన్ని గ్రామ సర్పంచ్‌కు అందజేయడం విశేషం. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, చిన్నారులు ప్రజలు భారీగా పాల్గొని ఉగాది సంబరాలను విజయవంతం చేశారు.