ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
calendar_today
July 31, 2026
person
Prajagalam News
• రూ.8 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
• జాప్యం వల్ల వేలాదిమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు
• బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముట్టడి.
(తాండూర్)
రాష్ట్రంలోని ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి కళాశాలలకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తాండూర్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం ప్రభుత్వ అధికారికి వినతిపత్రం సమర్పించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఫీజు రీఎంబర్స్మెంట్ నిధుల విడుదలలో జరుగుతున్న తీవ్ర జాప్యం కారణంగా వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్ మాట్లాడుతూ, గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులను సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 14 లక్షల మంది విద్యార్థుల విద్యాభవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ఎంతో కీలకమైనదని, అయితే నిధులు విడుదల కాకపోవడంతో ఆ పథకం లక్ష్యం పూర్తిగా దెబ్బతింటోందని పేర్కొన్నారు.ఫీజులు అందకపోవడంతో అనేక ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులను పరీక్షలకు అనుమతించకుండా అడ్డుకుంటున్నాయని, కొన్నిచోట్ల సర్టిఫికెట్లను నిలిపివేయడం, హాస్టళ్ల నుంచి బయటకు పంపించడం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ, వారి విద్యాభ్యాసం మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు.విద్య అనేది భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, అలాంటి హక్కును ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కాలరాస్తున్నారని సయ్యద్ షుకూర్ విమర్శించారు. బీసీ ఉద్యమ నాయకుడు ఆర్. కృష్ణయ్య సుదీర్ఘ పోరాట ఫలితంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం లక్షలాది మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకువచ్చిందని గుర్తు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఆ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయకుండా నిర్వీర్యం చేశాయని ఆరోపించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పూర్తిగా విస్మరించి బకాయిలను పేరుకుపోయేలా చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయకుండా వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నింటినీ విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలకు రూ.8,000 కోట్లకు పైగా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్న ఆయన, ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయకపోతే విద్యార్థి, యువజన సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. అవసరమైతే జిల్లా కేంద్రాలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.అనంతరం బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్డీఓ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేసి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం మహిళ జిల్లా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారి, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, బషీరాబాద్ మండల మహిళా అధ్యక్షురాలు వీరమణి, మీడియా ఇన్‌చార్జ్ బసవరాజ్, నాయకులు జోసఫ్, రాజు గౌడ్, పరమేష్, తాండ్ర నరేష్, మంతటి రాజు, గొట్లపల్లి రామ్, కిరణ్తో పాటు కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.