schedule Friday, July 31, 2026

విద్యార్థులు ప్రతి సబ్జెక్టు పైన పూర్తి పట్టును సాధించేలా విద్యాబోధన చేయాలి  ఉపాధి హమీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి  అంగన్వాడీ చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి చౌడాపూర్ మండలంలో ఆకస్మికంగా పర్యటించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ

calendar_today April 1, 2026
person Prajagalam News
విద్యార్థులు ప్రతి సబ్జెక్టు పైన పూర్తి పట్టును సాధించేలా విద్యాబోధన చేయాలి      ఉపాధి హమీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి      అంగన్వాడీ చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి     చౌడాపూర్ మండలంలో ఆకస్మికంగా పర్యటించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ
వికారాబాద్ జిల్లా (చౌడాపూర్):పదవ తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం చౌడాపూర్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఆకస్మికంగా పర్యటించి ఫర్టిలైజర్ దుకాణం, గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యవసర సరకుల అమ్మక కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్ర సందర్శనతోపాటు వివిధ నిర్మాణ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించారు. ఈ సందర్భంగా పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) ప్రత్యేక తరగతిలో ఉపాధ్యాయుల బోధన విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థులందరికీ ప్రతి సబ్జెక్టు పైన పూర్తి పట్టును సాధించేలా విద్యాబోధన చేయాలన్నారు. ముఖ్యమైన ప్రశ్నలకు తర్ఫీదు ఇస్తూనే, గత సంవత్సరం వచ్చిన ప్రశ్నాపత్రాలకు సమాధానాలు విద్యార్థుల ద్వారా రాబట్టే విధంగా విద్యాబోధన చేయాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే జాతీయ ఉపాధి హామీ కింద మంజూరైన కిచెన్ షెడ్, బాత్ రూమ్ లను వెంటనే నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వంటలను పరిశీలించి, మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని టీచర్ కు సూచించారు. గర్భిణి, బాలింతల వివరాలపై ఆరా తీస్తూ బాలామృతం అందరికీ ఇవ్వాలని సూచిస్తూ స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సామ్ మామ్ పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పౌష్టిక ఆహారాన్ని అందించాలని కలెక్టర్ సూచించారు. ప్రచభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీకి కలెక్టర్ సూచించారు. ఇళ్ల నిర్మాణాల్లో ఏమైనా సాంకేతిక సమస్యల ఉంటే సరిచేసి లబ్ధిదారులకు సహకరించాలని కలెక్టర్ తెలిపారు. ముందుగా ఫర్టిలైజర్, రేషన్ డీలర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసి డీలర్ల వద్ద ఉన్న స్టాక్ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. డీలర్ల వద్ద ఎరువులు పూర్తిగా అయిపోక ముందే ముందస్తుగా ఇండెంట్ పెట్టి యూరియాను తెప్పించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి రేణుకా దేవి, జిల్లా వ్యవసాయ అధికారి రాజా రత్నం, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో సోమలింగం, ఎంఇఓ రామచందర్, సర్పంచ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.