schedule Friday, July 31, 2026

రోడ్డుప్రమాదాల నివారణకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి  అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారీ

calendar_today April 13, 2026
person Prajagalam News
రోడ్డుప్రమాదాల నివారణకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి    అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారీ
వికారాబాద్ జిల్లా (కుల్కచర్ల)
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులకు సూచించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నిర్వహిస్తున్న “అరైవ్–అలైవ్” కార్యక్రమాల్లో భాగంగా కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల వల్ల లక్షా యాభై వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రమాదాల నివారణకు అవసరమైన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల పరిధిలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం, మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడపడం, అతివేగం కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 99 రోజుల ప్రజా పాలన ప్రణాళికలో భాగంగా వివిధ శాఖల ద్వారా అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అధికారుల సమిష్టి కృషితో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు ప్రజలను భాగస్వాములుగా చేసుకుంటే మార్పులు సాధ్యమవుతాయని కలెక్టర్ అన్నారు. అనంతరం గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు పరిశీలించారు. అదేవిధంగా పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, ఎంపీడీవో రామకృష్ణ నాయక్, ఎంఈఓ అబీబ్ అహ్మద్, ఎస్ఐ రమేష్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్, డిసిసి ఉపాధ్యక్షుడు బోలుసాని భీంరెడ్డి, మాజీ పాంబండ ఆలయ చైర్మన్ కోట్ల మహిపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీను, పంచాయతీ కార్యదర్శి జహంగీర్, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.