అంగన్వాడీ సేవల్లో సాంకేతిక విప్లవానికి ప్రజా ప్రభుత్వం నాంది
calendar_today
April 24, 2026
person
Prajagalam News
* డిజిటలైజ్ ద్వారా సేవలు వేగవంతం
*పారదర్శకంగా పౌష్టిక ఆహార పంపిణీ... ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
( తాండూర్)
అంగన్వాడి సేవలో సాంకేతిక విప్లవానికి ప్రజా ప్రభుత్వం నాంది పలికిందని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లోని కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడం ద్వారా సేవల్లో వేగం పెరుగుతుందని అన్నారు.గర్భిణీలు, బాలింతలు, పిల్లలు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, ఆరోగ్య సేవలను ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా మరింత పారదర్శకంగా, ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేసే వీలుంటుందని తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా అంగన్వాడీ టీచర్లు తమ బాధ్యతలను మరింత సమర్ధవంతంగా నిర్వహించవచ్చని అన్నారు.అంగన్వాడీ సిబ్బంది సేవలు గ్రామీణ ప్రాంతాలలో పిల్లల అభివృద్ధి, మహిళల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. స్మార్ట్‌ఫోన్ల ద్వారా ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో, డిజిటల్ సేవలు అందించడంలో టీచర్లకు మరింత సౌలభ్యం కలుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ధారసింగ్ , ఏఏంసి చైర్మన్లు నర్సింలు , అంజయ్య , వైస్ చైర్మన్ రజాక్, మండల తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్ లు, సర్పంచ్ లు, ఐసిడిఎస్ అధికారులు, మండల నాయకులు మరియు అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.