schedule Tuesday, July 28, 2026

పిఆర్సి ప్రకటించి, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

calendar_today July 16, 2026
person Prajagalam News
పిఆర్సి ప్రకటించి, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి
  • 'తపస్' ఆధ్వర్యంలో భారీ ధర్నా
  • తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్య
వికారాబాద్-: ఉపాధ్యాయులు, ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపాలని, వెంటనే కొత్త పీఆర్సీ ప్రకటించడంతో పాటు పెండింగ్లో ఉన్న 6 డీఏ లను విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్ ) డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోరుతూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో 'తపస్' ఆధ్వర్యంలో గురువారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్య హాజరై మాట్లాడారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్లే తాము ఉద్యమ పథం పట్టాల్సి వచ్చిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పిఆర్సి రిపోర్టును తెప్పించుకుని 51 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. 'ఈ-కుబేర్' లో పెండింగ్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల బిల్లులన్నింటినీ పూర్తిగా క్లియర్ చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి జాప్యం జరగకుండా చూడాలన్నారు. 6 డీఏల ప్రకటన లేకపోవడంతో ఒక్కొక్క ఉద్యోగి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ ఓ పి ఎస్ విధానాన్ని అమలు చేయాలని, 2003 డీస్సీ వారికి పాత పెన్షన్ వర్తింపజేస్తూ సుప్రీంకోర్టులో ఉన్న ఎస్ఎల్పిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. అలాగే జూన్ 2 నుండి హెల్త్ కార్డులు అమలు చేయకుండానే, మే నెల జీతంలో వాటా కోత విధించడం అన్యాయమని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాల భాగస్వామ్యంతో ట్రస్ట్ మార్గదర్శకాలు పూర్తయ్యాకే వాటా కట్ చేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, ఎస్ఎస్ఏ ఉద్యోగులు మహిళా ఉపాధ్యాయులు, సిబ్బందికి సమ్మె కాలపు జీతం చెల్లించి, కనీస కాలపరిమితి వేతనం వర్తింపజేయాలని, మోడల్ స్కూల్ 010 పద్దుపై సత్వర నిర్ణయం తీసుకోవాలన్నారు. DSC 2008 ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం విద్యాశాఖలో 190 జీవోను పూర్తిస్థాయిలో అమలు చేసి, అప్పీల్ చేసుకున్న అందరికీ ప్రమోషన్లు, బదిలీల ఉత్తర్వులు ఇవ్వాలని, ఉపాధ్యాయుల వార్షిక బదిలీలు, ప్రమోషన్ల క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం జూలై మొదటి వారంలోనే గ్రాంట్లు విడుదల చేయాలని, గురుకుల, ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలపై ప్రత్యేక కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతోనే జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి మెమోరాండం సమర్పిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే, రాబోయే ఆగస్టు 1వ తేదీన రాష్ట్ర రాజధానిలో 'రాష్ట్ర మహా ధర్నా' చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షులు సంగమేశ్వర్, ప్రధాన కార్యదర్శి గాజుల బస్వరాజ్, రాష్ట్ర బాధ్యులు రాములు,ఆనందం, జాక వెంకటేశం, మహిళా ఉపాధ్యక్షులు శ్రీలత రెడ్డి, గీతా నందిని మరియు జిల్లా, మండల స్థాయి ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.