schedule Tuesday, July 28, 2026

ఈ-కేవైసీ కి  నెలాఖరు వరకు మాత్రమే అవకాశం..!

calendar_today July 28, 2026
person Prajagalam News
ఈ-కేవైసీ కి  నెలాఖరు వరకు మాత్రమే అవకాశం..!

• ఈ-కేవైసీకు స్పందన అంతంతే.

• జిల్లాలో 71 శాతం ఈ-కేవైసీ పూర్తి – ఇంకా 29 శాతం పెండింగ్..!

• ఈకేవైసీ గడువులోగా పూర్తి చేసుకోవాలి : తాహశిల్దార్ తారా సింగ్...

(తాండూర్ )   రేషన్ కార్డుదారుల కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియకు ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదు. ఈ నెలాఖరు వరకు మాత్రమే అవకాశం ఉండటంతో మిగిలిన లబ్ధిదారులు వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు సుమారు 71 శాతం మంది మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నవి ప్రధానంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులేనని పేర్కొంటున్నారు. అయితే రేషన్ కార్డులో పేర్లు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను కాగితాల అవసరం లేకుండా డిజిటల్ విధానంలో పారదర్శకంగా అమలు చేయడమే ఈ-కేవైసీ లక్ష్యమని అధికారులు తెలిపారు. లబ్ధిదారుల వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా అర్హులకే ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అధికారుల సమాచారం ప్రకారం, ఈ-కేవైసీ పూర్తి చేసిన వారికే రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంది. అలాగే వచ్చే నెలలో మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంకా ఈ-కేవైసీ చేయించుకోని కార్డుదారులు నెలాఖరులోపు సమీప రేషన్ దుకాణం లేదా సంబంధిత కేంద్రాన్ని సంప్రదించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.ఈ-కేవైసీ చేయించుకోని వారికి రేషన్ బియ్యం నిలిపివేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో కార్డుదారుల్లో అయోమయం నెలకొంది. అయితే అధికారులు మాత్రం ఈ-కేవైసీ ప్రక్రియను నిర్లక్ష్యం చేయవద్దని, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నెల 31వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో ఇంకా ఈ-కేవైసీ చేయించుకోని కుటుంబ సభ్యులు వెంటనే సమీప రేషన్ దుకాణాన్ని సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు బయోమెట్రిక్ ధ్రువీకరణ చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డుల విషయంలోనే ఈ-కేవైసీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి కుటుంబాలు విడిపోయిన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. అయితే కార్డులు అందుకున్న అనంతరం కార్డులో పేర్లు ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ చాలామంది కొత్త కార్డు వచ్చిన వారు ఈ-కేవైసీ చేయించుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం చేశారు. మరికొన్ని కుటుంబాల్లో ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే ఈ-కేవైసీ చేయించుకోగా, మిగిలిన సభ్యులు ఇంకా చేయించుకోలేదు. వికారాబాద్ జిల్లాలో 83 వేల కొత్త కార్డులు జారీ అయ్యాయి. అయితే ఈ కొత్త కార్డుదారుల్లో గణనీయమైన సంఖ్యలో కుటుంబాలు ఇప్పటికీ ఈ-కేవైసీ పూర్తి చేయలేదు. ఈకేవైసీ గడువులోగా పూర్తి చేసుకోవాలి : తాహశిల్దార్ తారా సింగ్... రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా నిర్ణీత గడువులోగా ఈకేవైసీ (e-KYC) పూర్తి చేసుకోవాలని తాండూర్ తహసీల్దార్ తారా సింగ్ సూచించారు. గడువు ముగిసేలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయని వారి రేషన్ సరఫరాపై ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు నిర్లక్ష్యం చేయవద్దని ఆయన తెలిపారు.