ఎడ్యుకేషన్ హబ్ పనులు వేగవంతం చేయాలి
July 21, 2026
Prajagalam News
సీఎం రేవంత్ రెడ్డి
- వికారాబాద్ జిల్లా-:
- వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేట్ లో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల పురోగతిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. నిర్మాణ పనులు ఆశించిన వేగంతో సాగకపోవడంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎడ్యుకేషన్ హబ్‌లో చేపట్టిన అన్ని ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన నెలవారీ పురోగతి నివేదికలను క్రమం తప్పకుండా తనకు అందజేయాలని సూచించారు. పనుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను అవసరమైతే సస్పెండ్ చేయడానికీ వెనుకాడవద్దని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు.హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ కోసం భూములు కోల్పోయిన రైతులకు ఇవ్వాల్సిన నివాస ప్లాట్ల కేటాయింపులో జరుగుతున్న జాప్యంపై కూడా ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులందరికీ వచ్చే వారంలోపు ప్లాట్ల పట్టాలు అందజేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాజెక్టు సహా ఎడ్యుకేషన్ హబ్‌లోని అన్ని పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు.