శాంతియుత ‘చలో పార్లమెంట్’ మార్చ్‌పై పోలీసుల దాడి నిరంకుశత్వం
July 21, 2026
Prajagalam News
బీఆర్ఎస్ నాయకులు మల్కాపురం చైతన్య కిరణ్
వికారాబాద్ జిల్లా-:
దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు, పౌర సమాజ ప్రతినిధులు చేపట్టిన శాంతియుత 'చలో పార్లమెంట్' ప్రదర్శనపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని బీఆర్ఎస్ నాయకులు, యువ చైతన్యం ట్రస్ట్ ఛైర్మన్ మల్కాపురం చైతన్య కిరణ్ తీవ్రంగా ఖండించారు. ఆందోళన బాట పట్టిన విద్యార్థులకు, ప్రజా సంఘాల నాయకులకు ఆయన తన పూర్తి మద్దతును ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోటీ పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యా రంగంలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం పోలీసు బలగాలతో విద్యార్థుల గొంతు నొక్కాలని చూడటం సిగ్గుచేటని మండిపడ్డారు. సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ సహా అనేకమంది యువజన నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం పాలకుల నిరంకుశ వైఖరికి అద్దం పడుతోందన్నారు.
అక్రమంగా నిర్బంధించిన సోనమ్ వాంగ్‌చుక్ మరియు అరెస్ట్ చేసిన విద్యార్థి, యువజన నాయకులందరినీ తక్షణమే బేషరతుగా విడుదల చేయాలి.
లీకేజీలకు చరమగీతం పాడి, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
పోలీస్ దౌర్జన్యంపై విచారణ: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పౌరులపై, విద్యార్థులపై అక్రమంగా దాడికి పాల్పడిన పోలీస్ అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
హక్కుల కోసం, న్యాయం కోసం పోరాడుతున్న ప్రతీ విద్యార్థికి యువ చైతన్యం ట్రస్ట్ మరియు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, నిర్బంధించిన నాయకులందరినీ విడుదల చేసే వరకు ఈ పోరాటానికి తమ మద్దతు కొనసాగుతుందని చైతన్య కిరణ్ స్పష్టం చేశారు