schedule Tuesday, July 28, 2026

సీసీ రోడ్డు నిర్మాణంలో కానరాని నాణ్యత ప్రమాణాలు

calendar_today July 22, 2026
person Prajagalam News
సీసీ రోడ్డు నిర్మాణంలో కానరాని నాణ్యత ప్రమాణాలు
  పగుళ్లు ఏర్పడిన సీసీ రోడ్లు వికారాబాద్ జిల్లా-:వికారాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్లు నిర్మాణ పనుల్లో నాణ్యతను పట్టించుకునే వారే కరువయ్యారు. ఓ వైపు రోడ్లు వేస్తుండగానే మరో వైపు పగుళ్లు తేలుతున్నాయి. పనుల్లో నాణ్యతపై పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో పెద్ద మొత్తంలో నిధులు మంజూరు అవుతున్నాయి.వీటిని ఇష్టానుసారంగా రోడ్లు వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.నిర్మాణ పనుల్లో నాణ్యతను పట్టించుకునే వారు లేక రోడ్లకు క్యూరింగ్‌ చేయకపోవడంతో వేసిన కొన్ని రోజుల్లోనే కంకర తేలుతూ పగుళ్లు వస్తున్నాయి. ప్లాస్టిక్‌ కవర్లు పరిచి వాటిపై రోడ్లు వేస్తున్నారు. గంటల వ్యవధిలోనే రోడ్ల నిర్మాణాలను పూర్తి చేస్తున్నారంటే నాణ్యత ఏ మేరకు పాటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఏండ్ల పాటు నిలవాల్సిన రోడ్లు అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడకుండా పోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులకు నిధులు ఖర్చుచేయడంపై ఉన్న శ్రద్ధ పనుల నాణ్యతపై ఉండడం లేదని విమర్శలు వస్తున్నాయి. లక్షల రూపాయలతో వేస్తున్న సీసీ రోడ్లు పైపై పూతల్లా తయారయ్యాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పనులు నాణ్యతగా చేపట్టేలా పర్యవేక్షించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.ప్రజా ధనాన్ని వృధా చేయకుండా నాణ్యమైన సీసీ రోడ్లు వేయాలని అంటున్నారు.కాసులకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా రోడ్లు వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వికారాబాద్ మండలం కామారెడ్డి గూడ గ్రామంలో గత సంవత్సరం ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.8 లక్షలతో వేసిన రోడ్డు నిర్మాణం మరింత దారుణంగా ఉంది.రోడ్డు నిర్మాణంలో వినియోగించాల్సిన సిమెంట్‌, ఇసుక, కాంక్రిట్‌ సరిగా వేయలేదని,మట్టిపై కవర్లు కప్పి నిర్మాణం నాసిరకంగా చేపట్టారని గ్రామస్తులు ఆరోపించారు.రోడ్డు నాణ్యతను పట్టించుకోక పోవడం వల్లే సీసీ రోడ్డు వేసిన సంవత్సరం లోనే పగుళ్లు ఏర్పడి వాహన దారులకు,బాటసారులకు ఇబ్బందిగా మారింది. దీనితో పాటుగా వికారాబాద్ మండలంలోని బురాన్ పల్లి గ్రామంలో గతంలో వేసిన సీసీ రోడ్డు నిర్మాణం కూడా పగుళ్లు వచ్చాయి.రోడ్లు వేసే సమయంలో ఇంజనీర్ల సలహాలు సూచనలు పాటించకుండానే రోడ్ల నిర్మాణం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.రోడ్డు నాణ్యతను అధికారులు ఎవరూ పర్యవేక్షించడం లేదని, దీంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా రోడ్డు వేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నూతనంగా నిర్మించే రోడ్లు వేయాలని ప్రజలు కోరుతున్నారు.ప్రజలకు అనుగుణంగా,అవసరం అగు ప్రదేశాలకు ప్రాముఖ్యతను ఇచ్చి రోడ్లు వేయాలని స్థానికులు అంటున్నారు.