ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు
July 25, 2026
Prajagalam News
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
Vikarabad :-ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.
శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది.
ఈసందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు మాట్లాడుతూ....ఒక్కో మెడికల్ విద్యార్ధి విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై లక్షలు ఖర్చు చేస్తుందన్నారు. ప్రభుత్వ నియామకాల వల్ల ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం జరిగిందని, ఇంత చేసిన ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే వైద్య అధికారులు అంకితభావంతో పని చేయాలని సభాపతి తెలిపారు.విభాగాల అధిపతులు హైదరాబాద్ నుండి రోజు వచ్చి పోవడం కాకుండా స్థానికంగా ఉంటే ఎక్కువ సమయం వైద్య సేవలు అందించవచ్చని ఆయన అన్నారు.మెడికల్ కాలేజీ అందుబాటులో ఉందని, కాలేజీ అధ్యాపకులతో పాటుగా హాస్పిటల్ హెచ్ఓడి లు కూడా తమ అనుభవాలను విద్యార్థులకు నేర్పాలని ఆయన తెలిపారు.
గత ప్రభుత్వం చేసిన ఆర్ధిక విద్వంసం వలన నిధులను పెద్ద ఎత్తున మంజూరు చేయలేకపోతున్నామని అయినప్పటికీ ఉన్నంతలో అవసరమైన మేరకు నిధులను మంజూరు చేస్తున్నామని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధికంగా ప్రాముఖ్యత ఇస్తున్నదని ఆయన అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు అధికంగా వచ్చేది పేదలు మాత్రమేనని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య అధికారులు పనిచేయాలని ఆయన సూచించారు.
వికారాబాద్ చుట్టూ గ్రామాలు ఎక్కువ, ఇక్కడ వైద్యం అందకపోతే హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితీ ఉందని ఆయన అన్నారు.పెద్దపెద్ద జబ్బులకు పేదలు ప్రవేటు ఆసుపత్రులకు వెళ్తే ఖర్చులు తట్టుకోలేక ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉంటాయని ఆయన అన్నారు.
ప్రభుత్వం పేదల కోసం ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల టెస్టులు, చికిత్సలు, ఆపరేషన్లు చేయడానికి అవసరమైన పరికరాలు, వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని సభాపతి అన్నారు.
ప్రభుత్వం వందలు, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి బిల్డింగ్ లు, పరికరాలు, ఆపరేషన్ థియేటర్లు ఇతర వసతులు కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ప్రభుత్వం ఎంత ఖర్చు చేసినా డాక్టర్లు, సిబ్బంది నాణ్యమైన వైద్యం చేసి రోగులకు నయం జరిగితేనే సర్కారు వైద్యంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.మౌళిక వసతులు కల్పించడం మా బాధ్యత అయితే మంచి చికిత్స అందించడం వైద్యుల బాధ్యత అని ఆయన అన్నారు.
వికారాబాద్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న వంద బెడ్ల వికారాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను 30 కోట్ల రూపాయలతో 330 బెడ్లుగా అభివృద్ధి చేయడం జరిగిందని, 50 బెడ్ల క్రిటికల్ కేర్ యూనిట్ కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతుందని ఆయన తెలిపారు. వైద్య విద్యార్థులు అందుబాటులో ఉంటారు కాబట్టి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని ఆయన అన్నారు.మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పోకుండా మన ఆసుపత్రిలోనే వైద్య సేవలు అందే విదంగా చూడాలని అధికారులకు సూచించారు.ముఖ్యంగా యాక్సిడెంట్లు అయినప్పుడు మొదటి గంట చాలా ముఖ్యమని గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తే బతికించే అవకాశం ఉంటుందని కాబట్టి డాక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఇందుకు 24 గంటలు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని ఆయన సూచించారు.అంబులెన్స్ ఎప్పుడు కూడా వర్కింగ్ కండీషన్ లో ఉంచాలని, సమాచారం రాగానే నిమిషంలో బయల్దేరే విదంగా చూసుకోవాలని ఆయన తెలిపారు.హాస్పిటల్ కు అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానని, రోగులు హాస్పిటల్ కు బాధతో రావాలి, తిరిగి వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళే విదంగా అందరూ సేవలను అందించాలని ఆయన కాంక్షించారు. చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.... ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు విశ్వాసం కలిగే విధంగా వైద్య సేవలు అందించాలన్నారు. ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో మంచి ఫలితాలు సాధించే దిశగా వైద్యాధికారులు అంకితభావంతో పని చేయాలని ఎంపీ సూచించారు. ప్రజలకు నాణ్యమైన సేవలందిస్తూ గౌరవాన్ని సంపాదించుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. అంబులెన్స్ అందుబాటులో ఉండడంతో పాటు పరికరాలను కూడా సమకూర్చుకోవాలని ఆయన సూచించారు.
జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ... ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా కొడంగల్, వికారాబాద్ లలో జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి కాబట్టి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఆసుపత్రిలో ఏవైనా అవసరాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అదేవిధంగా సిబ్బంది కొరత ఉంటే కారుణ్య నియామకాల ద్వారా ఖాళీగా ఉన్న పోస్టులను నియమించేందుకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ తెలిపారు.
జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సుధాకర్ లాల్ మాట్లాడుతూ... సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా మాతా శిశు సంరక్షణ సేవలు అందిస్తున్నామన్నారు. ఆసుపత్రుల్లో 100 శాతం ప్రసవాలు చేపడుతూ, నవజాత శిశువుల మరణాలు తగ్గే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.సుబోద్ కుమార్, డిసిహెచ్ఓ కోఆర్డినేటర్ డాక్టర్ ఆనంద్, ఐఎంఎ జిల్లా డాక్టర్ల అసోసియేషన్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, రెడ్ క్రాస్ జిల్లా కార్యదర్శి టి.సాయి చౌదరి, వివిధ విభాగాల డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.