ప్రకటనలకే పరిమితమైన సబ్సిడీ రుణాలు
September 10, 2026
Prajagalam News
- బిసి, ఎస్సీ, ఎస్టీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
- బిజెపి రాష్ట్ర నాయకులు కె.పి రాజు
- Vikarabad-: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ రుణాలు మంజూరు చేయకపోవడం అత్యంత విచారకరమని, ఇది ఆయా వర్గాలను తీవ్రంగా వంచించడమేనని బీజేపీ రాష్ట్ర నాయకులు కె.పి రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో బిసి, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రూ. 1 లక్ష నుండి రూ. 12 లక్షల వరకు సబ్సిడీ రుణాలు అందిస్తామని, TGOBMMS పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని విస్తృతంగా ప్రచారం చేసుకుంది. అయితే, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఒక్క లబ్ధిదారుడికి కూడా సబ్సిడీ రుణాన్ని గ్రౌండింగ్ చేసిన (రుణం విడుదల చేసిన) దాఖలాలు లేవన్నారు.కార్పొరేషన్ల ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించి నెలలు గడుస్తున్నా, బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో ఆయా దరఖాస్తులు కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. ప్రభుత్వం నుంచి గ్యారెంటీ, సబ్సిడీ నిధులు విడుదల కాకపోవడంతో బ్యాంకర్లు కూడా లబ్ధిదారులకు రుణాలు ఇచ్చేందుకు ముందడుగు వేయడం లేదని చెప్పారు. స్వయం ఉపాధిపై ఆధారపడి జీవించే చేతివృత్తుల వారు, యువత, మహిళలు రుణాలు వస్తాయనే ఆశతో బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగి ఆర్థికంగా నష్టపోతున్నారని తెలియజేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఎంతమంది బిసి, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఖాతాల్లోకి సబ్సిడీ నిధులు జమ చేసిందో వెంటనే శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేవలం హామీలు ఇవ్వడం, ఎన్నికల ప్రచారం చేసుకోవడానికే సంక్షేమాన్ని పరిమితం చేయకుండా, తక్షణమే బడ్జెట్ నుంచి సబ్సిడీ నిధులను ఆయా కార్పొరేషన్లకు విడుదల చేయాలని, సబ్సిడీ రుణాలను క్షేత్రస్థాయిలో పంపిణీ చేయకపోతే రాబోయే రోజుల్లో బిసి, ఎస్సీ, ఎస్టీ వర్గాలను సమీకరించి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు పనిలేకుండా ఖాళీగా ఉన్నారు. కాబట్టి ఇది ఒక పనిగా పెట్టుకుని ప్రభుత్వం మీద దండయాత్ర చేయడానికి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నామని అన్నారు.