schedule Friday, September 11, 2026

అసెంబ్లీలో తాండూరు పరిశ్రమల సమస్యలపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గళం

calendar_today September 11, 2026
person Prajagalam News
అసెంబ్లీలో తాండూరు పరిశ్రమల సమస్యలపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గళం
   

• షాబాద్ స్టోన్‌కు రాయితీలు కల్పించాలి.

• లారీ పార్కింగ్ ఏర్పాటు, ఆటోమొబైల్  రంగానికి ప్రభుత్వ సహకారం అందించాలి

(తాండూరు) తాండూరు నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి కీలకంగా ఉన్న షాబాద్ స్టోన్ పరిశ్రమతో పాటు ఆటోమొబైల్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు, వ్యాపారులు, చిన్నతరహా పరిశ్రమల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.తాండూరు ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన షాబాద్ స్టోన్ పరిశ్రమ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పరిశ్రమలపై భారం తగ్గించేలా షాబాద్ స్టోన్‌కు తగిన రాయితీలు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాయితీలు, మౌలిక వసతుల కల్పన, అవసరమైన ప్రభుత్వ సహకారం అందితే ఈ రంగం మరింత అభివృద్ధి చెంది స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు.అదేవిధంగా తాండూరులో విస్తరిస్తున్న ఆటోమొబైల్ రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు సజావుగా కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించాలని సూచించారు. అదేవిధంగా  లారీ పార్కింగ్ ఏర్పాటు సహకారం అందించాలన్నారు. తాండూరు ప్రాంతంలోని పరిశ్రమల అభివృద్ధి కేవలం వ్యాపార రంగానికే పరిమితం కాదని, వాటిపై ఆధారపడిన కార్మిక కుటుంబాల జీవనోపాధితో ముడిపడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు మరింత పెరిగేలా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలని కోరారు.తాండూరు పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం అండగా నిలిస్తే మరిన్ని పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు.