హిందూ ఉత్సవ కేంద్ర సమితి నూతన కార్యవర్గానికి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి శుభాకాంక్షలు
calendar_today
September 10, 2026
person
Prajagalam News
• హిందూ ధర్మ పరిరక్షణతో పాటు ఉత్సవాలను ఐక్యంగా, వైభవంగా నిర్వహించాలి
తాండూరు, సెప్టెంబర్ 10:
హిందూ ఉత్సవ కేంద్ర సమితి నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. గురువారం సమితి ప్రధాన కార్యదర్శి బిర్కడ్ రఘు ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యులు హైదరాబాద్‌లోని చీఫ్ విప్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించిన డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, హిందూ ధర్మ పరిరక్షణతో పాటు సనాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించడంలో ఉత్సవ కమిటీల పాత్ర కీలకమని అన్నారు. హిందూ పండుగలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించేలా నిర్వహించాలని సూచించారు.ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించేందుకు సమితి సభ్యులు, ఉత్సవ కమిటీలు, యువత సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. పండుగల సందర్భంగా సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించాలని సూచించారు.హిందూ ఉత్సవ కేంద్ర సమితి నూతన కార్యవర్గం సమష్టిగా పనిచేస్తూ ధర్మ పరిరక్షణ, సాంస్కృతిక కార్యక్రమాలు, హిందూ పండుగల నిర్వహణలో మరింత చురుకైన పాత్ర పోషించాలని మహేందర్ రెడ్డి ఆకాంక్షించారు. సమితి చేపట్టే కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సిములు, హిందూ ఉత్సవ కేంద్ర సమితి గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, కోశాధికారి అంతారం కిరణ్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, అధికార ప్రతినిధి పర్యాద రామకృష్ణ, ప్రచార కార్యదర్శులు, సాంస్కృతిక కార్యదర్శులు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు, సోషల్ మీడియా కన్వీనర్లు, ఇతర నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.