• శాంతిభద్రతల పరిరక్షణకు సంబందిత శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు.
• తాండూర్ డివిజన్ ఆర్డీఓ కర్ర అనిత
(తాండూరు)
వినాయక చవితి ఉత్సవాలను మరియు నిమజ్జనోస్తవాలను పురస్కరించుకొని తాండూరు డివిజన్ ఆర్డీఓ కర్ర అనిత ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. తాండూరు డివిజన్ పరిధిలో గణేష్ ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టడంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు సమావేశంలో పాల్గొని ఉత్సవాల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. గణేష్ మండపాల ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమాలు, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా, పారిశుధ్యం, తాగునీటి సౌకర్యం, భక్తులకు అవసరమైన మౌలిక వసతులు వంటి అంశాలపై శాఖల వారీగా చర్చించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కర్ర అనిత మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో పాటు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రధాన కూడళ్లు, గణేష్ మండపాలు, నిమజ్జన మార్గాల్లో అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టడంతో పాటు, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. విద్యుత్ వైర్లు, పారిశుధ్యం, రహదారులు, తాగునీరు తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా సంబంధిత శాఖలు ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.గణేష్ ఉత్సవాలు సామరస్యానికి ప్రతీకగా నిలిచేలా నిర్వాహకులు, భక్తులు అధికారులకు సహకరించాలని కోరారు. ప్రజలు, ఉత్సవ కమిటీలు నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని అధికారులు సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి ,డిఎస్పి నర్సింగ్ యాదయ్య, సిఐలు, మున్సిపల్ కమిషనర్, ఆర్ అండ్ బి డి ఈ, విద్యుత్ డి ఈ, ఏఈ, వైద్యశాఖ , ఎక్సైజ్ శాఖ, అటవీశాఖ, మత్స్యశాఖ, తాండూర్ తహసిల్దార్, ఎంపీడీవో, యాలాల్ తహసిల్దార్ ఎంపీడీవో, తదితర శాఖలకు చెందిన అధికారులు, హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు,నాయకులు పాల్గొన్నారు.