తాండూరులో వరల్డ్ హార్ట్ డే ర్యాలీ
September 29, 2026
Prajagalam News
• గుండె ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించిన వైద్యులు
• వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంతో గుండెకు రక్షణ
• అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్
(తాండూరు) వరల్డ్ హార్ట్ డే సందర్భంగా తాండూరు పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో వైద్యుల అవగాహన ర్యాలీ నిర్వహించారు. శివాజీ చౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఇందిరా చౌక్ వరకు నిర్వహించారు. ఈ ర్యాలీలో పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొని ప్రజలకు గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. గుండె జబ్బుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్ మాట్లాడుతూ.. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణంగా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతోందన్నారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం, నడక లేదా ఇతర శారీరక శ్రమకు కేటాయించాలని తెలిపారు. సమతుల్యమైన ఆహారం తీసుకోవడంతో పాటు తాజా కూరగాయలు, పండ్లు, తక్కువ కొవ్వు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిదన్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్, అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని, అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ జయప్రసాద్ సూచించారు. ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక చెమటలు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు.“గుండెను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చు” అని డాక్టర్ జయప్రసాద్ పేర్కొన్నారు.ఈ ర్యాలీలో వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.