schedule Monday, October 26, 2026

తాండూరులో నీటి సమస్యపై కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి

calendar_today October 24, 2026
person Prajagalam News
తాండూరులో నీటి సమస్యపై కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి
   

• భవిష్యత్తులో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి

• మున్సిపల్ కమిషనర్‌కు బీజేపీ కౌన్సిలర్ల వినతి

{తాండూరు}

పట్టణంలో భవిష్యత్తులో తలెత్తే నీటి ఎద్దడిని నివారించడంతో పాటు, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు తక్షణమే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని బీజేపీ కౌన్సిలర్లు కోరారు. ఈ మేరకు తాండూరు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణంలో తాగునీటి సమస్య, నీటి నిల్వలు, నీటి వనరుల పరిరక్షణ, భవిష్యత్తులో ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కౌన్సిల్ సమావేశంలో సమగ్రంగా చర్చించాలని వారు కోరారు. ప్రభుత్వం, మున్సిపల్ యంత్రాంగం ఆధ్వర్యంలో నీటి సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఎలా వినియోగించుకోవాలి? నీటిని వృథా కాకుండా కాపాడేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలి? అనే అంశాలపై చర్చించి కార్యాచరణ రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.తాండూరు పట్టణంలో ఇప్పటికే పలు సమస్యలు ఉన్నాయని, రానున్న రోజుల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. నీటి వనరుల సంరక్షణ, నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించడం, తాగునీటి సరఫరాను మెరుగుపరచడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్, 28వ వార్డు కౌన్సిలర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం, 23వ వార్డు కౌన్సిలర్ అంతారం కిరణ్ కుమార్ పాల్గొని మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.