ముదిరాజులను 'బీసీ-ఏ'లోకి మార్చాల్సిందే: కావలి ప్రభు ముదిరాజ్ డిమాండ్
October 25, 2026
Prajagalam News
రాష్ట్ర జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉన్న ముదిరాజ్ కమ్యూనిటీకి విద్యా, ఉద్యోగ అవకాశాల్లో తగిన ప్రాధాన్యత లభించాలంటే వారిని 'బీసీ-డి' గ్రూప్ నుండి 'బీసీ-ఏ'లోకి మార్చాల్సిందేనని కావలి ప్రభు ముదిరాజ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.ముదిరాజ్ సమాజంలోని పేద ప్రజలు విద్యా, ఉద్యోగ రంగాలలో తీవ్రంగా వెనుకబడి ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి పాలనలోనే ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మార్చే ప్రక్రియ ప్రారంభమైందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ మార్పును అమలు చేయాలని కోరారు. రాబోయే కేబినెట్ సమావేశంలోనే దీనిపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభు ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో ముదిరాజులకు మాత్రమే తీవ్ర అన్యాయం జరుగుతోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ముదిరాజులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. ఒకవేళ ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి ఎవరైనా కుట్రలు చేస్తే, వారి యత్నాలను తిప్పికొడుతూ ఎంతటి నిరాహార దీక్షకైనా సిద్ధంగా ఉన్నానని ఆయన హెచ్చరించారు. ముదిరాజులందరూ ఐక్యంగా పోరాడి తమ హక్కు అయిన రిజర్వేషన్ సౌకర్యాన్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు.