schedule Monday, October 26, 2026

జర్నలిస్టు శంకర్ గౌడ్ ను వెంటనే విడుదల చేయాలి

calendar_today October 24, 2026
person Prajagalam News
జర్నలిస్టు శంకర్ గౌడ్ ను వెంటనే విడుదల చేయాలి

జర్నలిస్టు శంకర్ గౌడ్ ను వెంటనే విడుదల చేయాలి

టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు టి రాంచందర్ డిమాండ్

  • వికారాబాద్-:జర్నలిస్టు శంకర్ గౌడ్‌ను వెంటనే విడుదల చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో అరెస్టును వ్యతిరేకిస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టు శంకర్ గౌడ్‌ను వెంటనే విడుదల చేయాలని, ఆయనపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా అధ్యక్షులు టి రాంచందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు టి రాంచందర్, కోశాధికారి ప్రశాంత్, గణపురం శ్రీనివాసులు, సి శ్రీనివాస్ లు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సమాజానికి సేవ చేస్తున్న జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం, అరెస్టులకు పాల్పడటం ఆందోళన కలిగించే విషయమన్నారు. జర్నలిస్టులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. వార్తలు రాసే క్రమంలో జర్నలిస్టులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారికి అండగా నిలవాలని కోరారు. జర్నలిస్టు శంకర్ గౌడ్‌పై పెట్టిన కేసులను పునఃపరిశీలించి ఉపసంహరించుకోవాలని, ఆయనను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు స్వేచ్ఛగా తమ వృత్తి నిర్వహించుకునే వాతావరణాన్ని కల్పించాలని, మీడియా స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు సంఘాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా నిలిచి, వారి భద్రతకు భరోసా కల్పించాలని టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎం ఉదయ్ కుమార్, ఎన్ కుమార్, ఎం రమేష్, షాబుద్దీన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు