schedule Tuesday, October 27, 2026

నేరాల నివారణకు ప్రజలను భాగస్వామ్యం చేయడమే లక్ష్యం :- పరిగి డిఎస్పీ ఎన్. శ్రీనివాస్

calendar_today October 9, 2026
person Prajagalam News
నేరాల నివారణకు ప్రజలను భాగస్వామ్యం చేయడమే లక్ష్యం :- పరిగి డిఎస్పీ ఎన్. శ్రీనివాస్
  -కుల్కచర్ల మండల కేంద్రంలో 107 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం  -54 ద్విచక్ర వాహనాలు, 2ఆటోలు, 34 లీటర్ల మద్యం స్వాధీనం   కుల్కచర్ల   నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల నివారణ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడమే లక్ష్యంగా పోలీసులు పని చేయడం జరుగుతుందని పరిగి డిఎస్పీ ఎన్.శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున వికారాబాద్ జిల్లా పోలీసులు కుల్కచర్ల మండల కేంద్రంలోని కిందిగేరిలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా (ఐపీఎస్) ఆదేశాల మేరకు పరిగి డీఎస్పీ ఎన్.శ్రీనివాస్ పర్యవేక్షణలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 107 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇళ్లతో పాటు వాహనాలను తనిఖీ చేసి,అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పరిశీలించారు. వాహనాల పత్రాలు, ఇతర వివరాలను తనిఖీ చేసే క్రమంలో 54 ద్విచక్ర వాహనాలు,రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో 34 లీటర్ల మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నేర నియంత్రణ చర్యల్లో భాగంగా ఇద్దరు రౌడీషీటర్లను తనిఖీ చేసి వారి వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పరిగి డీఎస్పీ ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. గ్రామాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను అరికట్టడంతో పాటు నిందితులను గుర్తించడం సులభమవుతుందని వివరించారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ల ద్వారా పోలీసు-ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించడం, నేరాల నివారణలో ప్రజలను భాగస్వాములను చేయడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండల్ రెడ్డి, కొడంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి,కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్, పరిగి, చెంగోముల్, దోమ, కొడంగల్, బొంరాస్ పేట్, దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు,12 మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్లు, పోలీసు,హోంగార్డు సిబ్బంది పాల్గొన్నారు.