schedule Tuesday, October 27, 2026

రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వండి

calendar_today October 14, 2026
person Prajagalam News
రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వండి

 

 • అన్నదాతకు మెరుగైన సేవలు అందించండి 

• రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీఠ

• ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

  (తాండూర్) రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా అన్నదాతలకు మెరుగైన సేవలు అందించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (బీఎంఆర్) సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారి సమస్యలను గుర్తించి పరిష్కరించడంతో పాటు, మార్కెట్ కమిటీ అభివృద్ధికి నూతన పాలకవర్గ సభ్యులంతా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కోట్‌పల్లి మండల కేంద్రంలోని డీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కోట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే బీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా అనిత రమేష్ నాయక్, వైస్ చైర్మన్‌గా మధులత శ్రీనివాస్ చారి, ఇతర పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌తో పాటు పాలకవర్గ సభ్యులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు నమ్మకమైన సేవలు అందిస్తూ, వారి అభ్యున్నతికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మార్కెట్ కమిటీకి మంచి పేరు తీసుకురావడంతో పాటు, బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి చొరవ చూపాలని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పరస్పరం ముడిపడి ఉన్నాయని, ఈ దిశగా పాలకవర్గ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అన్నదాతలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. • 21 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ • అనంతరం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 21 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.21,02,436 విలువైన కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అలాగే అర్హులైన లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.