• విద్యుత్ కోతలు, పంట నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
• ఎల్‌నినోపై ముందస్తు చర్యలేవీ? సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర
• కాగ్నా ఇసుక దోపిడీతో భూగర్భ జలాలకు ముప్పు..
• తాండూరు ప్రయోజనాలను కొడంగల్‌కు తరలించే యత్నం
• వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉంటా
• మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
(తాండూరు)
రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, విద్యుత్ కోతలు, రైతుల పంట నష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు అంచనాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోలేదని, ఫలితంగా రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.విద్యుత్ కోతలు, లో వోల్టేజ్ సమస్యలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, గతంలో అవసరం తగ్గిన జనరేటర్లు, ఇన్వర్టర్లను తిరిగి వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వర్షాభావం, పంట నష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించేందుకు కుట్ర జరుగుతోందని పైలెట్ రోహిత్ రెడ్డి ఆరోపించారు. సింగరేణి భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. తాండూరు ప్రాంతంలో భూగర్భ జలాల మట్టాన్ని పెంచి, రైతులకు సాగునీటి భరోసా కల్పించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాగ్నా నదిపై 11 చెక్‌డ్యామ్‌లను నిర్మించినట్లు గుర్తుచేశారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాగ్నా నదిలో ఇసుక దోపిడీ జరుగుతోందని, ఇది పర్యావరణానికి, భూగర్భ జలాల పరిరక్షణకు నష్టం కలిగించే ప్రమాదం ఉందని ఆరోపించారు.తాండూరు ప్రాంతానికి కీలకమైన నీటి వనరులు, జిల్లా ఆస్పత్రి ప్రయోజనాలను కొడంగల్‌కు ధారాదత్తం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పైలెట్ రోహిత్ రెడ్డి విమర్శించారు. ఆర్టీఓ కార్యాలయాన్ని సైతం కొడంగల్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, తాండూరు ప్రజల హక్కులు, ప్రాంతీయ ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. రైతుల పంట నష్టాలు, విద్యుత్ సరఫరా, కాగ్నా నది పరిరక్షణ, సింగరేణి భవిష్యత్తు, తాండూరు ప్రాంత అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన కోరారు. ప్రభుత్వ వైఖరిపై ప్రజలకు స్పష్టతనిచ్చేలా ఆయా అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాండూర్ బిడ్డగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ లో భాగంగా డిగ్రీ చదివిన వారు ఎన్రోల్మెంట్ చేసుకోవాలని సూచించారు. గతంలో ఓటు హక్కు ఉన్న క్రొత్తగా ఎన్రోల్మెంట్ అమూల్యమైన ఓటును నమోదు చేసుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నరసింహులు, శ్రీనివాస్ చారి, నరేందర్ గౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.