ప్రజావాణి కి ఇద్దరే హాజరు.మిగతా కుర్చీలు ఖాళీ* *నిరాశతో వెనుదిరిగిన ఫిర్యాదుదారులు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్*
October 19, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం బషీరాబాద్ మండలంలో నామమాత్రంగా మారింది. బషీరాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు డుమ్మా కొట్టారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు గైర్హాజరు కావడంతో ప్రజావాణి లక్ష్యం నీరుగారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సోమవారం నాటి ప్రజావాణి కార్యక్రమానికి వెటర్నరీ విఎల్ఓ విలాసిని,ఎంపీడీవో కార్యాలయం టైపిస్టు చెన్నయ్య మినహా ఇతర శాఖల అధికారులు హాజరుకాలేదు. ప్రజల ఫిర్యాదులను స్వీకరించాల్సిన కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.
తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందాలనే ఆశతో కార్యాలయానికి వచ్చిన ప్రజలకు నిరాశే ఎదురైంది. అధికారులు అందుబాటులో లేకపోవడంతో పలువురు ఫిర్యాదులు అందించకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించే కార్యక్రమానికే అధికారులు ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణికి గైర్హాజరైన అధికారుల తీరుపై ఉన్నతాధికారులు దృష్టి సారించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.