October 21, 2026
Prajagalam News
దసరా వేడుకల్లో ప్లాట్ వివాదం.. హిందూ ఐక్యతకు విఘాతమా?
బోనమ్మ ఆలయ వేదికపై కౌన్సిలర్ వ్యాఖ్యలతో కలకలం.. నేతల మౌనంపై చర్చ!
నవదిశ, తాండూరు: తాండూరు పట్టణంలోని బోనమ్మ దేవాలయ ప్రాంగణంలో మంగళవారం రాత్రి నిర్వహించిన సామూహిక దసరా వేడుకల్లో స్వల్ప గందరగోళం చోటుచేసుకుంది. 10వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ తన ప్రసంగంలో హిందూ ఉత్సవ కేంద్ర సమితి ప్లాట్ సమస్యను ప్రస్తావించడంతో వేదికపై ఉద్రిక్తత నెలకొంది. దీంతో వేడుకలకు కొంత అంతరాయం ఏర్పడింది.
హిందువులంతా ఐక్యంగా జరుపుకోవాల్సిన పండుగ వేళ వివాదాస్పద అంశాలను ప్రస్తావించడం సమంజసం కాదని పలువురు భక్తులు అభిప్రాయపడ్డారు. సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా, వేదికపై పరిణామాలు చోటుచేసుకున్న సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిల స్పందనపై చర్చ సాగుతోంది. పండుగలు విభేదాలకు వేదికలు కాకుండా హిందూ ఐక్యతకు ప్రతీకలుగా నిలవాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు.