• ఆస్ట్రేలియాకు తొలిసారిగా ఎగుమతి.. రైతుల్లో హర్షం
(తాండూర్)
తాండూరు ప్రాంత రైతులకు గర్వకారణంగా నిలిచే అరుదైన ఘనత దక్కింది. జీఐ ట్యాగ్ పొందిన తాండూరు తాండూర్ కందులు తొలిసారిగా ఆస్ట్రేలియాకు ఎగుమతి అవుతున్నాయి. అపెడా సహకారంతో 2.5 మెట్రిక్ టన్నుల కందుల తొలి సరుకును బుధవారం హైదరాబాద్ నుంచి ప్రారంభించారు.‘అమ్మాస్’ (AMMAAS) బ్రాండ్ పేరుతో దుర్గా ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సంస్థ ఈ కందులను సముద్ర మార్గంలో ఆస్ట్రేలియాకు పంపిస్తోంది. తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్, యాలాల మండలాల్లో సాగయ్యే ఈ కందులకు ప్రత్యేక రుచి, పోషక విలువలు, నాణ్యత విశిష్టత. తెలంగాణ నుంచి జీఐ గుర్తింపు పొందిన తొలి వ్యవసాయ ఉత్పత్తిగా తాండూరు కందులు ప్రత్యేక గుర్తింపు సాధించాయి. ఈ ఎగుమతితో తాండూరు కందులకు అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత ఆదరణ లభించే అవకాశం ఉంది. తద్వారా స్థానిక రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు, వ్యవసాయ రంగానికి కొత్త ప్రోత్సాహం లభించనున్నాయి.తాండూరు కందుల ఖ్యాతి ఖండాంతరాలకు చేరడం తెలంగాణ రైతులకు గర్వకారణం.