schedule Wednesday, October 28, 2026

నిరుద్యోగ యువత ఆశలకు అండగా బీఎంఆర్ ఫౌండేషన్

calendar_today October 28, 2026
person Prajagalam News
నిరుద్యోగ యువత ఆశలకు అండగా బీఎంఆర్ ఫౌండేషన్
 

• ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడండి.. మీ భవిష్యత్తును మీ కృషే నిర్ణయిస్తుంది

• అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

• ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ.. 250 మంది అభ్యర్థులకు ప్రోత్సాహం

(తాండూరు)

నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తూ, పేద విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో బీఎంఆర్ ఫౌండేషన్ అందిస్తున్న సహకారం అభినందనీయమని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఆర్థిక ఇబ్బందులు యువత భవిష్యత్తుకు అడ్డంకి కాకూడదనే సంకల్పంతో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (బీఎంఆర్) చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు. తాండూరు పట్టణంలోని విలియం మూన్ స్కూల్లో బీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సుమారు 250 మంది అభ్యర్థులకు బుధవారం ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాతో కలిసి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్‌తో పాటు స్టడీ మెటీరియల్ అందించడం సంతోషకరమన్నారు. 2018లో పరిగిలో నిరుద్యోగ యువత కోసం ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. 2022లో పరిగి నియోజకవర్గంలోని సుమారు 60 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు గైడ్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. పేద కుటుంబాల్లో మరణాలు సంభవించినప్పుడు ఆర్థిక సహాయం అందిస్తూ, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు వివిధ రూపాల్లో అండగా నిలుస్తున్న బీఎంఆర్ ఫౌండేషన్ సేవలను ఆయన అభినందించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు.అనంతరం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “నవంబర్ 29న ఎస్ఐ, డిసెంబర్ 20న కానిస్టేబుల్ పరీక్షలు జరిగే వరకు మీకు ఉద్యోగం మాత్రమే కనిపించాలి. అర్జునుడికి పక్షి కన్ను ఎలా కనిపించిందో.. మీ లక్ష్యం కూడా అంతే స్పష్టంగా ఉండాలి” అని పిలుపునిచ్చారు. ఉచిత కోచింగ్‌గా భావించి నిర్లక్ష్యం చేయవద్దని, పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో వెనుకబడకూడదనే ఉద్దేశంతో వారి తరఫున తానే కోచింగ్ ఫీజు భరిస్తున్నానని తెలిపారు. ఫీజు చెల్లించి చదువుతున్నామనే బాధ్యతతో, పట్టుదలతో శిక్షణ తీసుకొని ఉద్యోగం సాధించాలని సూచించారు. ఖరీదైన పుస్తకాలు, పెద్ద కోచింగ్ సెంటర్లలో చదివే అవకాశం లేకపోయినా ఆత్మవిశ్వాసం, కష్టపడే తత్వం, పట్టుదల ఉంటే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చన్నారు. “మీ ఆర్థిక పరిస్థితి మీ భవిష్యత్తును నిర్ణయించకూడదు.. మీ కృషి, మీ పట్టుదలే మీ భవిష్యత్తును నిర్ణయించాలి” అని యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు.పోలీసు యూనిఫాం ధరించడం గౌరవంతో పాటు గొప్ప బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల భద్రతను కాపాడటం, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడం, చట్టాన్ని గౌరవించడం పోలీసుల ప్రధాన విధులని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో పాటు మంచి వ్యక్తిగా, బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదగాలని సూచించారు. ప్రస్తుతం అందిస్తున్న కోచింగ్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకే కాకుండా భవిష్యత్తులో నిర్వహించే ఇతర రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుందని  ఎమ్మెల్యే తెలిపారు. ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు గ్రౌండ్‌లో ఫిజికల్ టెస్టుల కోసం శిక్షణ అందించేందుకు కృషి చేస్తానని, అనంతరం తుది రాత పరీక్షకు సైతం ఉచిత కోచింగ్ కల్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. 2018లో పరిగిలో సుమారు 1,500 మంది అభ్యర్థులతో ఉచిత కోచింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు బీఎంఆర్ గుర్తుచేశారు. ఆ శిక్షణ ద్వారా పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితాల్లో స్థిరపడటం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.ప్రస్తుతం శిక్షణ పొందుతున్న అభ్యర్థులు కూడా పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలని, భవిష్యత్తులో తమలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మరో విద్యార్థికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ధారాసింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ కాసిం అలీ, పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.